ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద నేరాలు సైబర్ నేరాలేనన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). వీటిని కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు తర్జనబర్జన పడుతున్నాయని, సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం కనుగొంటున్నారని, ఇది చాలా ఆందోళనకర అంశమని రేవంత్ పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రతల్లేంటి అనేది ప్రతి ఒక్కరికీ తెలియాలని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా సైబర్ నేరాలు, సైబర్ సేఫ్టీ(Cyber Safety)పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు.
ఒకప్పుడు హత్య, దోపిడీలు తీవ్ర నేరాలుగా ఉండేవని, కానీ ఈరోజున సైబర్ నేరాలు అత్యంత తీవ్రమైనవిగా భావించబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రతి క్షణానికి ఒక సైబర్ నేరం(Cyber Crime) జరుగుతుందని అన్నారు. ‘‘సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేరం జరిగిన తరువాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా నిరోధించేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు.