పదేళ్లుగా తెలంగాణకు గ్రహణం పట్టింది.. ఆ చంద్రగ్రహణం అంతరించిపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష మంది మహిళలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakthi Sabha) కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించారు. జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో 31 పెట్రోల్ బంకుల నిర్వహణకి శ్రీకారం చుట్టారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ… కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రగ్రహణం అంతరించడంతో మహిళలు స్వేచ్ఛగా బతుకుతున్నారన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడ్డారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని మహిళలు కోరుకున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తే వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా చేస్తాం అని హామీ ఇచ్చారు.