గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్(KCR).. పాలమూరు ప్రాజెక్ట్‌లను(Palamuru Rangareddy Project) ఎందుకు పూర్తి చేయాలేదు. అంతకుముందు ఎంపీగా గెలిచినా.. పార్లమెంటులో ఏనాడూ కూడా పాలమూరు గురించి మాట్లాడలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదు పదేళ్ల పాటు అంతా అన్యాయమే. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకోవడంపై పెట్టిన దృష్టి జిల్లా అభివృద్ధిపై పెట్టలేదు’’ అని విమర్శించారు.
‘‘గతంలో కొందరు సీఎంలు సైతం తమ రాజకీయానికి పాలమూరును పావుగా వినియోగించుకున్నారు. కానీ జిల్లాకు చేసిందేమీ లేదు. నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లు పదేళ్ల కాలంలో ఎందుకు పూర్తి కాలేదు. పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే ఈరోజున చంద్రబాబు(Chandrababu)తో పంచాయితీ ఉండేది కాదు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేది కాదు. సాగునీటి కోసం తెలంగాణ రైతుల కన్నీటి బాధలు ఉండేవి కాదు.
వైఎస్ఆర్, జగన్.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. నా మీద పగతోనే మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్ట్‌ను అటకెక్కించారు’’ అని Revanth Reddy ఆరోపించారు.