ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని(Rajiv Yuva Vikasam Scheme) తీసుకొచ్చింది. ఈ పథకాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నో కీలక పథకాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయని రేవంత్ అన్నారు. మహిళలకు ఉచిత బట్టు, వైఎస్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు అసెంబ్లీ ప్రారంగణం నుంచి ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం(Rajiv Yuva Vikasam Scheme) కింద ప్రాధాన్యత కల్పించాలి. పారదర్శకంగా ఉండాలి. అర్హులు, నిజమైన నిరుద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉద్దేశించిన ఈ పథకం ముందు ముందు మరింత పటిష్టంగా అమలు చేస్తాం. అర్హులైన యువతీ యువకులను ఎంపిక చేయడానికి ప్రజా ప్రతినిధులు మండలాల వారిగా సమావేశాలు నిర్వహించుకోవాలి. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వారికి 50 వేల నుంచి 4 లక్షల వరకు సహాయం అందించవచ్చు. ఇవ్వగలిగిన చోట ఉద్యోగాలు ఇస్తున్నాం. అవకాశాలున్న చోట ఉపాధి కల్పిస్తున్నాం. నైపుణ్యాన్ని నేర్పించాల్సిన చోట వృత్తి నైపుణ్య శిక్షణనిస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలో 57 వేలకుపైగా ఉద్యోగాలు ఇవ్వడంలో ఎక్కడా చిన్న పొరపాటు జరక్కుండా పారదర్శకంగా భర్తీ చేశాం. 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లు, 30 వేల టీచర్ల బదిలీల్లో ఎక్కడా చిన్న ఆరోపణ రాకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి జరగని బదిలీల ప్రక్రియను పూర్తి చేశాం. రాష్ట్రంలో సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. గతంలో నచ్చితే నజరానా నచ్చకపోతే జురిమానా విధానం ఉండేది. కానీ ప్రజా ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన, విధానపరమైన నిర్ణయాలతో పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం” అని రేవంత్ వివరించారు.