రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారస్తులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపారస్తులు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకుండా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఒక్క రైతుకైనా అన్యాయం జరిగినట్లు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
‘‘కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోండి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. వారందరిపై తక్షణమే చర్యలు చేపట్టాలి. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులకు గందరగోళానికి గురి చేయడం, రైతులను వేధించడం లాంటి అంశాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రమంతా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలి’’ అని ఆదేశించారు రేవంత్(Revanth Reddy).