నారాయణ పేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయగా, పలు ప్రాజెక్ట్‌లను ప్రారంబించారు. అనంతరం నారాయణ పేటలో నిర్వహించిన “ప్రజా పాలన- ప్రగతి బాట(Praja Palana – Pragathi Bata)” బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్, పారామెడికల్, నర్సింగ్కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గతంలో మెడికల్ కాలేజీకి అనుమతలివ్వడానికి కేంద్రం తిరస్కరించిందని, కానీ తమ మంత్రులు, అధికారులు ఎంతో పోరాడి అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. ప్రజల విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ మెడికల్ కాలేజీ నిలువెత్తు నిదర్శనమని అన్నారు రేవంత్.
‘‘కాలేజీలో పూర్తి స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన పేదవాడికి సంక్షేమం చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్లు అని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మీ అవసరాలపై అవగాహన ఉన్నవారే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పేదలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది.
డాక్టర్ వృత్తి ఒక ఉద్యోగం కాదు… ఒక బాధ్యత. మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరు’’ అని విద్యార్థులను ప్రోత్సహించారు. యాభై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి(Chittem Narsi Reddy) పేరు ఈ కాలేజీకి పెట్టడం సముచితం అని నేను భావిస్తున్నా. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మా అధికారులకు సూచిస్తున్నా అని Revanth Reddy తెలిపారు.