తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సెక్యూరిటీ విషయంలో కీలక మార్పులు జరిగాయి. గతంలో కేసీఆర్ వద్ద పనిచేసిన పోలీస్ సెక్యూరిటీని మార్చాలని సీఎం డెసిషన్ తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందన్న అనుమానంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త అధికారులను నియమిస్తూ ఇంటెలిజెన్స్ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ముఖ్యమైన శాఖల్లో అధికారుల మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే సీఎం భద్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు జారి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. గడచిన పదేళ్ల ప్రభుత్వంలో బడ్జెట్ పై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో హరీష్ రావు కొన్ని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇవ్వబోతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం తీసుకున్న వివరాలు ఎవరి నుంచి ఎవరి వద్దకు వచ్చాయనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని హరీష్(Harish Rao) అన్నారు. ప్రభుత్వంలో తమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని హరీష్ చేసిన వ్యాఖ్యలని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము తీసుకునే నిర్ణయాలు, పాలసీ విధానాలకు సంబంధించిన విషయాలు, సీఎం భద్రతా పరమైన అంశాలు బయటకి వెళ్తున్నాయనే సందేహం మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు లీక్ అవడంపై రేవంత్(CM Revanth Reddy) సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కానీ, ఇతర శాఖల్లోని ఉద్యోగుల నుంచి కానీ ప్రతిపక్షాలకు సమాచారం ఎవరు చేరవేస్తున్నారు అనే అంశం పై దృష్టి సారించారు. గతంలో కేసీఆర్ నివసించిన ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఇతర ప్రోటోకాల్ సిబ్బంది కానీ ఏ ఒక్కరూ తన వద్ద ఉండకూడదని ఉన్నతాధికారులకు రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బందిని మారుస్తూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.