తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన కుల గణనను(Caste Census) ప్రకారం.. రాష్ట్రంలో బీసీల సంఖ్య తగ్గిందని అన్నారు. కాగా అసలు రాష్ట్రంలో బీసీల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పాలని ఈటల ప్రశ్నించారు. కాంగ్రెస్ తనకు నచ్చినట్లు లెక్కలు రాసుకుందని, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ హామీ నుంచి తప్పించుకోవడానికి తప్పుడు లెక్కలు చెప్తోందని ఆరోపించారు.
‘‘కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేంద్రం తెలంగాణకు భారీగానే నిధులు ఇచ్చింది. రామగుండం ఎరువుల పరిశ్రమకు రూ.6,309 కోట్లు మంజూరు చేసింది. కాజీపేటలో రైల్వే కోట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.వేల కోట్ల రుణాలు మంజూరు చేసింది. బయ్యాంలో ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయొచ్చు కదా? రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు?’’ అని ప్రశ్నించారు ఈటల(Eatala Rajender).