తెలంగాణకు ప్రాజెక్ట్‌లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషణ్ రెడ్డి.. తెలంగాణ పాలిట సైంధవుడిలా తయారయ్యారంటూ గాంధీభవన్‌లో(Gandhi Bhavan) నిర్వహించిన సమావేశంలో మండిపడ్డారు సీఎం రేవంత్. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్ట్(Metro Project) విస్తరణకు అనుమతి లభించడం లేదని మండిపడ్డారు సీఎం. ‘‘తెలంగాణకు మీరు ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉందా కిషన్ రెడ్డి. గట్టిగా మాట్లాడగలం కదా అని బెదిరింపులకు తెగబడితే ఇక్కడ బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరు. మెట్రో, ఆర్ఆర్ఆర్(RRR) ప్రాజెక్ట్‌లను కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడకు వచ్చి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు’’ అని ఆరోపించారు రేవంత్.
‘‘సబర్మతి సుందరీకరణ ప్రశంసించిన కిషన్ రెడ్డి(Kishan Reddy).. మూసీ ప్రక్షాళనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తులు ఇవ్వమని అడగడం లేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు అందుతున్నాయి. రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల్లో పావలా కూడా తిరిగి రావడం లేదు. కేంద్రం ప్రభుత్వం నిధులన్నీ కూడా యూపీ, బీహార్‌లకే ఇస్తుంది. తెలంగాణకు అన్యాయం చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడైనా తెలంగాణ ప్రాజెక్ట్‌ల గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారా? ఇప్పటి వరకు తెలంగాణకు ఎన్ని ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చారు?’’ అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు రేవంత్(Revanth Reddy).