20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌కు కాలం చెల్లిందని.. కారు షెడ్డుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. తాను తలుచుకుంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది మిగులుతారో లెక్కేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతి పెట్టారని సెటైర్లు వేశారు. బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. గజ్వేల్ దొర- గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యంత్రి అయ్యాడని తెలిపారు. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని కోరారు.