తెలంగాణలో నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉందన్న విషయాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి పెట్టడం లేదని, అందువల్లే వారికి ఉపాధి, ఉద్యోగం లభించడం కష్టతమరమవుతుందని చెప్పారు. అదే విధంగా ఎక్కువ కాలం ఉద్యోగం రాని సమయంలోనే చెడు అలవాట్లు ఏర్పడతాయని, అవి కాస్తా వ్యసనాలుగా మారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయని చెప్పారు. కాబట్టి నిరుద్యోగులు ఎవరూ కూడా ఉద్యోగం రాలేదన్న బాధ, నిరాశతో చెడు మార్గంలో పయనించొద్దని హెచ్చరించారు. బీటెక్ పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగం లేకపోవడంతో డ్రగ్స్, మత్తుపదార్థాలు అనే విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య నిర్మూలనకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ సమస్యను ప్రభుత్వం ఒక్కటే పరిష్కరించలేదు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
ఉద్యోగం లేదనో, ఉపాధి లభించలేదనో యువతను దెప్పిపొడవడం మంచిది కాదని సీఎం సూచించారు. అలాంటి సమయాల్లోనే వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించారు. వారిని చులకనగా చూడటం వల్ల ఆత్మన్యూనతకు గురవుతారని, అలాంటి బలహీన సమయాల్లోనే వారు మాదకద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలు చెడగొట్టుకుంటారని తెలిపారు. అలా జరగకుండా ఉండాలంటే అంతా కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అతి త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎంత చదువుకున్నా సరే.. నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని Revanth Reddy తెలిపారు.