Revanth Reddy | కిషన్ రెడ్డికి ఆయన బాధ్యత గుర్తు చేసిన సీఎం రేవంత్

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తన బాధ్యతలు మరిచారా? అంటే తెలంగాణ కాంగ్రెస్ అవుననే అంటోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరు విషయంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి తన బాధ్యతను మరిచారని, దానిని గుర్తు చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నట్లు కూడా రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతకీ రేవంత్ లేఖలో ఏమని ఉందంటే..

- Advertisement -

‘‘రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy) అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతారాహిత్యం.. తెలంగాణలో 2023, డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2(Hyderabad Metro Phase- 2), ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నాం. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు. ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi), కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను.

తెలంగాణకు జీవనాడి అయిన హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్ -1 (69 కి.మీ.) నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మెట్రో రాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2 ప్రాజెక్ట్పై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2 ప్రాజెక్ట్లపై పూర్తి దృష్టిసారించాను. హైదరాబాద్ నలుమూలలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు వీలుగా మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా అయిదు కారిడార్లను ప్రతిపాదించాం.

నాగోల్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 3.2.), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్ చెరు (13.4 కి.మీ.), ఎల్ బీ నగర్- హయత్ నగర్ (7.1 కి.మీ.) మార్గాల నిర్మాణానికి రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి (2024, జనవరి 4వ తేదీ) వినతిపత్రం అందజేశాం. తర్వాత 2024, అక్టోబరు ఏడో తేదీన ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు(Manohar Lal Khattar) ప్రతిపాదనలు అందజేశాను.

2024, నవంబరు నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో ఫేజ్-2 డిటైయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సమర్పించాం. 2024, డిసెంబరు 12వ తేదీన ఢిల్లీలో నేను మీతో సమావేశమై హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను తెలియజేసి లేఖను అందజేశాను. ఈ ఏడాది జనవరి 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆయనను కలిసి మెట్రో ఫేజ్-2 ప్రాధాన్యాన్ని సవివరంగా తెలియజేశాను. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు (2025, ఫిబ్రవరి 26వ తేదీన) ఇదే అంశంపై లేఖ అందజేశాను.

మెట్రో ఫేజ్- 2కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని అన్ని లేఖల్లో స్పష్టంగా వివరించాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, తెలంగాణ నుంచి మీరు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే 2021, ఏప్రిల్లో బెంగళూర్ మెట్రో ఫేజ్- 2 (అంచనా వ్యయం రూ.14,778 కోట్లు), 2024 ఆగస్టులో బెంగళూర్ మెట్రో ఫేజ్- 3 (అంచనా వ్యయం రూ.15,611 కోట్లు), 2024, అక్టోబరులో చెన్నై మెట్రో ఫేజ్- 2 (అంచనా వ్యయం రూ.63,246 కోట్లు)లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2కు ఆమోదం తెలపాలని ఏడాది కాలంగా మేం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం… హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉండడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ నది పునరుజ్జీవనంపైనా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి నీటిని మూసీతో అనుసంధానించడం (రూ.2 వేల కోట్లు), 55 కిలోమీటర్ల మేర మూసీకి ఇరువైపులా ఎస్టీపీల నిర్మాణం వారసత్వ వంతెనల అభివృద్ధి (రూ.4 వేల కోట్లు), గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ (రూ.4 వేల కోట్లు), మూసీ ఈస్ట్-వెస్ట్ ఎలివేటెడ్ కారిడార్ (రూ.10 వేల కోట్లు) పనులు చేపట్టనున్నాం.

ఇంత కీలకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(CR Patil) ను 2024, జులై 22వ తేదీన కలిసి వివరాలతో కూడిన లేఖను అందజేశాం. మూసీ పునరుజ్జీవంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు లేఖలు అందజేశాం. మీతో సమావేశమైన రోజు మూసీ పునరుజ్జీవన ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు సమగ్ర వివరాలతో లేఖను అందజేశాను.

ఈ నెల 21వ తేదీన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారుల బృందం మిమ్మల్ని కలిసి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మూసీ పునరుజ్జీవంపై లేఖను అందజేశాను. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడంతో పాటు నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు నగరాన్ని అనుసంధానించేందుకు ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఎంతో అవసరం.

రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో ఉన్న పాలకులు ఆర్ఆర్ఆర్ భూ సేకరణ, టెండర్లు, అనుమతుల సాధనలో పూర్తి నిర్లక్ష్యం వహించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో 2024, ఫిబ్రవరి 20వ తేదీన, 2024, జూన్ 26న, 2024 డిసెంబరు 12న సమావేశమై ఆర్ఆర్ఆర్ ప్రాధాన్యాన్ని వివరించాను. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి పరిహారం, యుటిలిటీస్ తరలింపు వ్యయం భరింపు తదితర అంశాలపై చర్చించాను. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కరీకి(Nitin Gadkari) వివరించాను.

ఒకేసారి రెండు భాగాలు పూర్తికాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొనే వ్యయప్రయాసలను కేంద్ర మంత్రికి వివరించాను. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి టెండర్లు పిలిచింది. అయినప్పటికీ కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించకపోవడంతోనే టెండర్లను మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. మీతో సమావేశమైనప్పుడు ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలపై చర్చించాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023, ఏప్రిల్ 8వ తేదీన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని మీకు గుర్తు చేశాను.

మొత్తం రీజినల్ రింగు రోడ్డు అనుమతులు, మంజూరుకు (రూ.34,367.62 కోట్లు) సంబంధించిన వివరాలను, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణంపై (రూ.45 వేల కోట్లు) వివరించి మీకు లేఖను అందజేశాను. తాజాగా ప్రధానమంత్రికి ఆర్ఆర్ఆర్ పై వివరించి లేఖను అందజేశాను. ఆర్ఆర్ఆర్ కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు (370 కి.మీ.) నిర్మించాలని మీతో చర్చించడంతో పాటు ప్రధానమంత్రికి లేఖ అందజేశాను.

హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో నిర్మించనున్న డ్రైపోర్ట్ ను ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్ట్కు అనుసంధానించేలా గ్రీన్ ఫీల్డ్ రహదారి (రూ.17 వేల కోట్లు) నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ప్రతిసారి కోరడంతో పాటు మిమ్మల్ని కలిసినప్పుడు చర్చించాను. వీటితో హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్ (రూ.17,212.69 కోట్లు), వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ (రూ.4,170 కోట్లు)కు సంబంధించి మీతో చర్చించాను. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రూ.1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, మంజూరుపై చర్చించి పూర్తి వివరాలతో మీకు లేఖను అందజేశాను.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఉన్న నేను(Revanth Reddy) భారత సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే సాధనే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మంజూరుతో పాటు ఆర్ఆర్ఆర్(RRR) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, దక్షిణ భాగం మంజూరు, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్(Regional Ring Rail) మంజూరు, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్ నుంచి సీ పోర్ట్కు గ్రీస్ఫీల్డ్ రహదారి మంజూరుకు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భరించాల్సిన వ్యయం భరిస్తామంటూ ముందుకొచ్చాం.

స్వయంగా నేను మీతో కలిసి చర్చించి అన్నింటిపై లేఖలు అందజేశాను. 2019 నుంచి కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత.. ఇదే విషయాన్ని నేను బహిరంగంగానే పలుమార్లు ప్రకటించాను. మీరు కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూర్ లకు మెట్రో విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అదే హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఏడాదిగా మేం పలుమార్లు విజ్ఞప్తి చేసినా, మిమ్మల్ని కలిసి విన్నవించినా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇదే విషయాన్ని నేను తెలియజేశా.. గుజరాత్లో సబర్మతీ, ఉత్తర భారత దేశంలో గంగా నది పునరుజ్జీవనంపై కేంద్ర మంత్రిగా, బీజేపీ నేతగా మీరు పలుమార్లు ప్రకటనలు చేశారు. ఆయా నదుల పునరుజ్జీవనంపై ప్రశంసలు గుప్పిస్తూ.. పత్రికల్లో వ్యాసాలు రాసిన మీరు తెలంగాణలో మూసీ నది(Musi River) పునరుజ్జీవంపై విషం చిమ్ముతున్నారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, దక్షిణ భాగం మంజూరు, రీజినల్ రింగు రైలు మార్గం మంజూరు, డ్రైపోర్ట్ నుంచి సీ పోర్టు గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు విషయంలోనూ మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి(Revanth Reddy) అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని, మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలవడం, ఆయా శాఖలు అడిగిన వివరాలు అందజేయడం, ప్రధానమంత్రిని కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని, విధానాన్ని అనుసరించడం లేదని మీరు మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరం.. రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహించిన గౌరవ జైపాల్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు వంటి వారు హైదరాబాద్ మెట్రో రైలు, సింగరేణి కార్మికులకు పింఛను వంటి సౌకర్యాలను కల్పించి తమదైన ముద్రవేశారు.

తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీరు తెలంగాణకు చేసిందేమిటో ప్రజలకు తెలియజేయండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మేం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు ఏవిధంగా చేయూతనిస్తారో చెబితే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. అంతేగానీ కేంద్రమంత్రిగా ఉండి ఏ ఒక్కటీ సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఇకనైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రూ.1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని రేవంత్(Revanth Reddy) తన లేఖలో రాసుకొచ్చారు.

Read Also: బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల.. ఏయే శాఖకు ఎన్ని నిధులంటే..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mamnoor Airport | వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్‌లోని మామురు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర...

Revanth Reddy | ‘దేశ రక్షణకు యువత కలిసి రావాలి’

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దేశ రక్షణపై కూడా దృష్టి...