తెలంగాణలోని నిరుద్యోగ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులకు సూచించారు. చాలా మంది విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పట్టించుకోవడం లేదని, అందువల్లే వాళ్లు చదువు పూర్తయిన తర్వాత కూడా నిరుద్యోగులుగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. మాసబ్‌ట్యాంక్‌లో నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే నిరుద్యోగులకు సీఎం రేవంత్ ఓ చిట్కా చెప్పారు. అదే డిమాండ్ అండ్ సప్లై అని సులభంగా వివరించారు సీఎం.
‘‘నిరుద్యోగ యువత దీనిని గుర్తుంచుకోవాలి. బయట మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉందో చూసి అందులో నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఉద్యోగం, ఉపాధి లభించడం సులభతరం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ వినూత్న కోర్సును ఆవిష్కరిస్తున్నాం. ఇదే అంశంపై పలు సంస్థల యాజమాన్యాలతో చర్చించి.. ఎలాంటి కోర్సు చేసిన వారు వారికి కావాలన్న అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ దిశగా విద్యార్థులకు, నిరుద్యోగులకు శిక్షణ అందించాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ కోర్సు ద్వారా ఎందరో నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది’’ అని Revanth Reddy చెప్పారు.