గులాబీ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టడానికి కమ్యూనిస్టులు తాపత్రయపడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో సహా మిగిలిన నేతలు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి మంతనాలు జరిపారు. తమకు ఐదు లేదా ఏడు సీట్లు ఇవ్వాలని కోరారు. అయితే మూడు లేదా నాలుగు సీట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు, కొత్తగూడెం, హూస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ, వైరా, పినపాక సీట్లు అడుగుతున్నారు సీపీఐ నేతలు. ఈ నెల 17లోపు సీట్ల లెక్క తేల్చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
మరోవైపు మధిర, పాలేరు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ సీట్లను సీపీఎం అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ నేతలు పొత్తుపై మౌనంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పెద్దలను ఇంతవరకు కలవలేదు. దీంతో సీపీఎం కలుస్తుందో లేదో అనే సందిగ్ధత ఏర్పడింది. ఒకవేళ అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కూడా కాదంటే కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టుల కలలకు కేసీఆర్ తూట్లు పొడిచారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటే లబ్ది జరుగుతుంది అనుకున్న ఎర్రజెండా పార్టీలకు గులాబీ బాస్ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు.