ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) ఘాటుగా స్పందించారు. కక్షపూరితంగా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ కు అస్సలు తెలియదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎన్నడూ అలా చేయలేదని కూడా అన్నారు. తమ ప్రభుత్వం ఏకాడికి గత ప్రభుత్వం చేసిన తప్పులనే సరిదిద్దుతుందే తప్పా.. తమకు ఎవరిపైనా కక్ష లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్(BRS).. మంచి ప్రతిపక్షంగా సూచనలు ఇస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల సలహాలను స్వీకరించడాన్ని మేము అగౌరవంగా భావించమని, వారి సలహాలు, సూచనలను మనస్ఫూర్తిగా స్వీకరించి.. తమ పథకాలు, చర్యలను మరింత మెరుగు పరుచుకోవడానికే ప్రయత్నిస్తామని చెప్పారాయన.
‘‘సమగ్ర కుటుంబ సర్వే(Family Survey)ను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఎంతో దూరదృష్టితో ఆలోచించి చేపట్టింది. ఎవరిపైనో కక్ష పెట్టుకుని తమ ప్రభుత్వం ఈ సర్వే చేయడం లేదు.. కేవలం ప్రజలకు మంచి చేయలన్న ఉద్దేశంతో చేపట్టింది. గత ప్రభుత్వం.. సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్ష సాధింపు చర్యగా తలపెట్టదు. గత ప్రభుత్వ నేతలు చేసిన అక్రమాలపై కూడా చట్టపరంగానే చర్యలుంటాయి. ఎవరినో టార్గెట్ చేసి తాముఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది’’ అని చెప్పారు పొంగులేటి(Minister Ponguleti).