కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా, వారిని ప్రశ్నించినా అక్రమ కేసులు(Illegal Cases) పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని కవిత విమర్శించారు. శనివారం ఖమ్మం(Khammam) జిల్లా పర్యటనలో భాగంగా జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను ఆమె పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టే అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, ఈ విధానం సరికాదని కవిత అన్నారు.
తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతామంటూ తేల్చి చెప్పారు. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదన్నారు.
ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలను(BRS Activists) అరెస్ట్ చేసి కేసీఆర్(KCR)ను కట్టడి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని, కానీ అది ఈ జన్మలో జరగబోదని అన్నారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల్లో ప్రజలకు రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, మీవన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కవిత(MLC Kavitha).