తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ ఆర్థికంగా, సమర్థంగా ఉండాలని, అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా మహిళలు అన్ని రంగాల్లో అభ్యున్నతి చెందాలని మంత్రి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని పీపుల్‌ప్లాజాలో సరస్ ఫెయిర్(SARAS FAIR)ను ప్రారంభించిన సందర్బంగా ఆమె ప్రసంగించారు. ఇందులో భాగంగానే మహిళలు చేస్తున్న 17 రకాల వ్యాపారాలను గుర్తించి వారికి వడ్డీలేని రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు.
‘‘మహిళల అభివద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. స్కూల్ యూనిఫార్మ్‌లు కుట్టే పనిని కూడా మహిళలకే అందించాం. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఈ సరస్ ఫెయిర్ అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది మహిళలు ఈ ఫెయిర్‌లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నాం’’ అని మంత్రి సీతక్క(Seethakka) వెల్లడించారు.