బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన చూస్తే బీజేపీ కడుపు మండుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం స్పందిస్తూ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తునన్ని పథకాలు బీజేపీ అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సుభిక్ష పాలన అందిస్తుందని, అది బీజేపీ జీర్ఖం కావట్లేదంటూ విసుర్లు విసిరారు. బీజేపీ ఎప్పుడైనా రైతులకు బోనస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు.
‘‘ఛార్జ్ షీట్ కాదు, బీజేపీని ప్రాసిక్యూట్ చేయాలి. రైతుల కోసం మేం మాట్లాడుతుంటే, అంబానీ(Ambani), అదానీ(Adani)ల కోసం బీజేపీ(BJP) మాట్లాడుతోంది. బీజేపీ ఓర్వలేని తనం బయటపడింది. బీజేపీ ఉనికి చాటుకోవడానికే చార్జీ షీట్ వేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బోనస్ ఇస్తున్నారా? కోటి కుటుంబాలకి ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాం.
సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి 20వేల కోట్ల రాయితీలు ఇస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ ఎక్కడైనా అమలు చేస్తున్నారా? బీఆర్ఎస్ విడుతల వారిగా చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తాం.
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెస్తామని 10 సంవత్సరాలు దాటింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా బీజేపీ చేసిందేమీ లేదు. ప్రభుత్వం సంబరాలు చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మోదీకి వివరించండి’’ అని MLC Jeevan Reddy వ్యాఖ్యానించారు.