కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యుల్లోనూ, అభిమానుల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో డీఎస్ భౌతికకాయాన్ని ఉంచారు. కడసారి చూపు కోసం డీఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలివెళ్తున్నారు. రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.
డీఎస్ కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా పని చేయగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డీఎస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా పని చేశారు. 2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన డీఎస్(Dharmapuri Srinivas).. అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూడు కాంగ్రెస్ లో చేరారు.