రేవంత్ సొంత ఊరి(Kondareddypalli)లో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని ఆవుల సరిత, విజయారెడ్డి అనే మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ కి ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే… రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పై జరుగుతోన్న ఆందోళనలపై న్యూస్ కవర్ చేసేందుకు మహిళా జర్నలిస్టులు తమ టీమ్ తో కలిసి కొండారెడ్డిపల్లి(Kondareddypalli) వెళ్లారు. అక్కడ జరుగుతోన్న ఆందోళనలు షూట్ చేస్తూ, స్థానికుల నుంచి బైట్స్ తీసుకోబోతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టి, వారి ఫోన్లు, కెమెరాలు, కెమెరాలలో చిప్స్ లాక్కున్నారు. వారి నుండి తమ పరికరాలు లాక్కునేందుకు మహిళా జర్నలిస్టులు ప్రయత్నించగా పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తమపై రేవంత్(Revanth Reddy) అనుచరులు దాడి చేశారని, మట్టిలోకి నెట్టేశారని మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్‌గా తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కోరుతున్నారు.