Corporate facilities in Government Hospitals in Telangana says minister Harish Rao: డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. డయాలసిస్ సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా వందల కోట్లు ఖర్చుపెడుతుందని పేర్కొన్నారు. నేడు నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్ లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.
డయాలసిస్ సేవలందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు 102 కి పెంచామని అన్నారు. ఇంతకుముందు ఇది కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైందని అన్నారు. డయాలసిస్ చేసుకున్నవారికి బస్ పాస్, పింఛన్లు, జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు.
పేదలకు అత్యున్నత వైద్యం నేడు తెలంగాణలో అరోగ్య శ్రీలో అందుతుందని, పేద వారికి అర్ధం అయ్యేలా వివిధ రంగుల మూడు పౌచుల్లో మందులు పెట్టి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్ళు పూర్తి చేశామన్నారు. గత ఏడాది ఎక్విప్మెంట్ కోసం 150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలిపారు. ప్రజల్లో ఎక్కువ బీపీ షుగర్ వస్తున్నాయని, వాటిని ప్రాథమిక దశలో గుర్తించి మందులు ఇస్తున్నట్లు తెలిపారు.
వైద్యులు నిత్య విద్యార్థులని కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచుకోవాలని అన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని అన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అత్యధికంగా నిమ్స్ లో జరుగుతున్నాయని.. నిమ్స్ ని మరింత బలోపేతం చేయడానికి పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వైద్య సిబ్బంది ఓనర్ షిప్ తో పని చేసి.. పేదలకు మంచి వైద్యం అందించాలని సూచించారు.