తన కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖా(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని, తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హీరో నాగార్జున(Nagarjuna) కోర్టుకెక్కారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడంతో పాటు ఆమెపై క్రిమినల్ చర్చలు తీసుకోవాలని కూడా నాగార్జున తన పిటిషన్‌లో కోరారు. కాగా ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని అధికారులకు కోర్డు ఆదేశించింది. కాగా ఈ కేసులో ఇతర సాక్షుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది కోర్డును కోరారు. వాంగ్మూలం తీసుకున్న తర్వాత విచారణను కొనసాగించనున్నట్లు చెప్తూ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున వాంగ్మూలాన్ని అధికారులు ఈరోజు రికార్డ్ చేయనున్నారు.
‘‘సదరు మంత్రి తన వ్యాఖ్యలతో మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు. నా కుమారుడు నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ తమతమ జీవితాలను గౌరవంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన రాజకీయాల కోసం వీరి విడాకుల అంశాన్ని పావుగా వినియోగించుకోవడం ఏమాత్రం సబబు కాదు. దశాబ్దాలు సినీ పరిశ్రమలో కానీ, ప్రజల్లో కానీ కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబ గౌరవాన్ని సైతం సదరు మంత్రి తన వ్యాఖ్యలతో దెబ్బతీశారు. ఆమె వ్యాఖ్యలతో మా కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున(Nagarjuna) తన పిటిషన్‌లో పేర్కొన్నారు.