Dasoju Sravan: సీనియర్ రాజకీయ నేత దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆగష్టులో ఢిల్లీ వెళ్లి బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన బీజేపీ గూటికి చేరిన ఆయన బీజేపీకి రాజీనామా చేస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపిచారు. అయితే.. నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది. బండి సంజయ్‌కు పంపిన రాజీనామా లేఖలో ఆసక్తికర విషయాలను దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) రాసుకొచ్చారు.
‘‘తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశ దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన మీరు, మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరితో బీజేపీలో నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది. అనేక ఆశలతో ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్థమైంది. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం, తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అని లేఖలో పేర్కొన్నారు. అయితే.. కమలం పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన కారు ఎక్కెందుకు సిద్ధం అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కూడా కలిసిన ఆయన సాయంత్రం గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.
Read also: అసెంబ్లీ సమీపంలో రివాల్వర్లు కలకలం
.