ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) లో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదాపడింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. సమయం లేకపోవడంతో జస్టిస్ బెల ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపలేదు. దీంతో తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. కాగా తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కవిత సుప్రీంను ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే ఇటీవల లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది. ఈనెల 26న విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందంటూ విచారణకు హాజరుకాలేదు. తాజాగా మార్చి 13కు విచారణ వాయిదా వేయడంతో సీబీఐ ఎలా ముందుకు వెళ్లనుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.