తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. 6 నవంబర్ 2024న ఈ సర్వే ప్రారంభమైనా రెండు రోజులుగా హౌస్ మార్కింగ్‌లో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ రెండు రోజుల పాటు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సర్వే స్టిక్కర్‌ను అంటించారు. వాటి ప్రకారం ఈరోజు నుంచి కుటుంబ సర్వే పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti).. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అధికారులు సమన్వయం పాటించాలని, ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వెల్లడించారు.
అంతేకాకుండా ‘‘ప్రజలకు వచ్చే అన్ని సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రజల సందేహాలు వెంటనే నివృత్తి అయ్యేలా చర్యలు చేపట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలి. ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ సర్వేపై ప్రతి అధికారి కూడా విస్తృతమైన ప్రచారం చేయాలి. ఎక్కడా అలసత్వం అనేది లేకుండా సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతంమవుతుంది’’ అని భట్టి(Deputy CM Bhatti) వివరించారు.