ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడం, రైతులకు అండగా నిలవడమే అజెండగా తాము పాలన కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రజా విజయోత్సవా(Praja Vijayotsavam)ల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో సీఎం ప్రసంగించారు. ఇందులో కీలక విషయాలను పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలను అందించామని అన్నారు. దేశంలో మరే ఇతర ప్రభుత్వం కూడా ఇటువంటి ఘనత సాధించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రూప్-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో రూ.1,035 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
‘‘గడిచిన పదేళ్లలో అభివృద్ధికి నోచుకోని ఎన్నో కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా, కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించేది లేదు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారిగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పింది.
ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టాం. నిరుపేదల బిడ్డలు చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే పదేళ్లుగా పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్, ఒక లా కాలేజీ మంజూరు చేస్తాం. పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయం’’ అని అన్నారు.
‘‘కాళేశ్వరం నుంచి చుక్కనీరు వినియోగించకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు రూ.7500 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశాం.
తొలి సంవత్సరంలో రూ.21వేల కోట్లతో 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. నిర్భందాల మధ్య సాగిన పదేళ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించాం. ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నాం’’ అని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).