వరి కొనుగోళ్లలో భారీ స్కాం తో 4 వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(KCR) కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రెండున్నర వేల మంది రైస్ మిల్లర్లు ఉన్నారని, వాళ్ళ పొట్ట గొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వెయ్యి కోట్ల టర్నోవర్ వంద కోట్ల లాభం ఉంటేనే మిల్లర్లు టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారన్నారు.
రైస్ మిల్లులు కాదనీ ధాన్యమంత కార్పొరేట్ కంపెనీలతో అమ్ముకునేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకొని వచ్చే డబ్బులతో ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు 40 కోట్లు ఇవ్వాలని చూస్తున్నారని అరవింద్(Dharmapuri Arvind) ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కన్న పందికొక్కులు నయమన్నారు. ఎంఎస్‌పీకే రైస్ మిల్లర్లు ధాన్యం కొనేందుకు సిద్దంగా ఉన్నారని, రైతులను, రైస్ మిల్లర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.