భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పటిష్ఠం చేయడానికి లోక్‌మంథన్(Lok Manthan) చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రశంసించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన లోక్‌మంథన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా లోక్‌మంథన్ కార్యక్రమాన్ని కొనియాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్ భావనను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇది చాలా మంచి ప్రయత్నమని, ప్రతి ఒక్కరికీ భారతీయ సంస్కృతి, ఆచారాలపై అవగాహన వస్తుందని అన్నారు.
‘‘2018లో రాంచీ(Ranchi) వేదికగా జరిగిన లోక్‌మంథన్(Lok Manthan) కార్యక్రమంలో పాల్గొన్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పటిష్టత కోసం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇది విజయవంతం కావాలి. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఇంద్రధనుస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.