ప్రధాని మోదీ కులాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోయే కాలం వచ్చే రేవంత్ నోట ఇలాంటి మాటలు వచ్చాయని మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ నేత ఈటల రాజేందర్(Eatala Rajender) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని, లేకుంటే నవ్వుల పాలవుతారని హితవు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డికి పోయేకాలం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆసేతు హిమాచలం మోదీని విశ్వసించని, ప్రేమించని వారు ఎవరూ లేరని అన్నారు ఈటల.
‘‘గతంలో కేసీఆర్(KCR) కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోడీ(Modi) గీడీ అని మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సాకారం కావాలి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. మోదీ బీసీ కాదని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి పోయేకాలమా? మోడీ మీద విమర్శలు సూర్యుని మీద ఉమ్మి వేసినట్టు ఉన్నాయి. ఆయన మీద విమర్శ చేస్తే ప్రజలు గతంలో వారికి చెప్పిన బుద్దే మీకూ చెప్తారు. మోడీతో గొక్కోవడం అంటే ధర్మంతో, ప్రజలతో గోక్కోవడమే. ఆ నిమిషానికి చప్పట్లు కొట్టొచ్చు కానీ తరువాత పర్యావసానాలు కేసీఆర్‌కి అర్ధం అయ్యాయి. మీకు కూడా త్వరలోనే అర్ధం అవుతాయి. పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా’’ అని Eatala Rajender సూచించారు.