తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్(KCR) మాటలు ఇక తెలంగాణ జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ రైతులను ఆదుకునే దిక్కు లేదు కానీ.. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు ఇస్తారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు బీజేపీ అండగా నిలబడుతుందని చెప్పారు. ఇవాళ ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) రైతు డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని తెలిపారు. ఖమ్మం సభ ద్వారా బీజేపీ వైఖరి స్పష్టం చేస్తామని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఈటల(Eatala Rajender) ధీమా వ్యక్తం చేశారు.