తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)కు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) హెచ్చరిక నోటీసులు జారీ చేసింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదని నోటీసుల్లో పేర్కొంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని తెలిపింది. ప్రస్తుతం దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని భవిష్యత్‌లో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ నోటీసులను సీఈవో వికాస్ రాజ్ ముఖ్యమంత్రికి పంపించారు.
దుబ్బాక(Dubbaka) ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి కేసీఆర్ మాట్లాడుతూ బాన్సువాడ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో కేసీఆర్(KCR) వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది.