అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్(Rekha Naik) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) కూడా గులాబీకి బైబై చెప్పేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన గెలుపే అన్నింటీకి సమాధానం తెలిపారు. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఎంతో బాధపడ్డానన్నారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ మూలాలను మర్చిపోవద్దని సూచించారు. నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తున్నానని.. వారం పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రజల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరేశం(Vemula Veeresham) కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. నకిరేకల్ టికెట్ బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్యకు కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే.