హైదారాబాద్ లో ఫేమస్ హోటల్స్ లో ‘సుబ్బయ్య గారి హోటల్(Subbayya Gari Hotel) ఒకటి. ఏపీ కాకినాడలో బాగా పాపులర్ అయిన ఈ హోటల్ హైదరాబాద్ లో చాలా చోట్ల తమ బ్రాంచెస్ ఓపెన్ చేసింది. హోటల్ లో భోజనం చేయడానికి వెళ్లిన కస్టమర్లకు వాళ్ళిచ్చే ఆతిథ్యంతోనే సగం కడుపు నిండిపోతుంది. సకల మర్యాదలతో కొసరి కొసరి వడ్డించి విసిగించేస్తారనుకోండి. అసలు ఈ కస్టమర్ సర్విస్ వలనే సుబ్బయ్య గారి హోటల్ కి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. కానీ, సుబ్బయ్య గారి హోటల్లో బుట్టభోజనం లొట్టలేసుకుంటూ తినే ఆ హోటల్ అభిమానులకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు ఓ చేదు వార్త చెప్పారు.
హోటల్ యాజమాన్యం పైకి మాత్రమే కస్టమర్లపై ఎనలేని అభిమానం కురిపిస్తుంది. కానీ, అక్కడ తినేవారికి శుచిగా శుభ్రంగా వండి వడ్డించాలి అనే విషయం మాత్రం గాలికొదిలేసినట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. గురువారం గచ్చిబౌలి రోడ్డులోని కొండాపూర్ లో సుబ్బయ్య గారి హోటల్ లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్ కిచెన్ ని చూసి షాకయ్యారు. హోటల్ యాజమాన్యం ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు.
వంటగది ప్రాంతం చాలా అపరిశుభ్రంగా ఉందని, నేల చెదురుమదురుగా విరిగిపోయి ఉందని, గోడలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆహార భద్రతా కమిషనర్ బృందాలు నివేదించాయి. డ్రైనేజీలు మూసుకుపోయి, పొంగిపొర్లుతున్నాయని, ఆహార వ్యర్థాలను రెగ్యులర్ గా తొలగించడం లేదని గుర్తించారు. ఆహార నిర్వహణదారులు హెడ్ క్యాప్, గ్లౌజులు మొదలైనవి లేకుండా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఎగ్జాస్ట్ నుండి నూనె కారుతున్నట్లు గుర్తించారు. స్టవ్ లు, పాత్రలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి అని బృందాలు నివేదించాయి.
సుబ్బయ్య గారి హోటల్లో(Subbayya Gari Hotel) కూరగాయలు సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల అవి ఎండిపోయాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. స్టోర్ రూమ్ దయనీయ స్థితిలో ఉందని, సరిగ్గా నిర్వహించడం లేదని చెప్పారు. నీటి నాణ్యత విశ్లేషణ, తెగులు నియంత్రణ, ఆహార నిర్వహణదారుల వైద్య ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లకు సంబంధించిన నివేదికలు అందుబాటులో లేవని ధ్రువీకరించారు.