బుధవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్(KCR) హాజరవనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ ధ్రువీకరించారు. గవర్నర్ ప్రసంగానికి, రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు కూడా కేసీఆర్ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. శస్త్రచికిత్స నుండి కోలుకున్న తర్వాత కేసీఆర్ తరచూ పార్టీ నాయకులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్‌లో జోష్ పెంచింది. ఆయన పొలిటికల్ యాక్టివ్ అవనున్నారనే సంకేతాలను ఇచ్చింది.
ఇదే క్రమంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ చీఫ్ KCR ఈ సమావేశమంతా హాజరవుతారా అని కేటీఆర్(KTR) ని మీడియా ప్రశ్నించగా… ఆయన తనయుడిగా, పార్టీ నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉండటాన్ని వ్యక్తిగతంగా ఇష్టపడతానని అన్నారు. “కాంగ్రెస్‌లో ఎవరూ కేసీఆర్ స్థాయిని సరిపోల్చలేరు. వారి చౌకబారు వ్యాఖ్యలను ఆయన సహించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన కేసీఆర్ స్థాయికి ఏ మాత్రం సరిపోరు” అని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర శాసనసభ లోపల, బయట తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన నొక్కి చెప్పారు.