తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ ప్రభుత్వంలోనైనా నళినిని తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. కాగా, ఇటీవల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. నళిని ప్రస్తావన తీసుకువచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమానికి మద్దతుగా తన పదవిని త్యాగం చేసిన ఆమెను.. తిరిగి సర్వీస్ లోకి తీసుకోవడంలో ఉన్న అడ్డంకులు ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
తిరిగి డీఎస్పీ పదవి ఇవ్వడం కుదరదన్న పక్షంలో.. అదే స్థాయిలో మరి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందేమో చూడమని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలి అంటూ అధికారులను కోరారు. అయితే తనకి పదవి ఇవ్వడంపై నళిని స్పందించారు. తనపై అభిమానం చూపిన సీఎం రేవంత్ కి లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగానికి న్యాయం చేయలేనని చెప్పారు. చాలా గ్యాప్ రావడంతో ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయానని పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నానని, ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి సాయం చేయాలని సీఎంని కోరారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు నళిని(Former DSP Nalini) సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తోంది.