తెలంగాణ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు తాజాగా రాజకీయ నేతల వైపుకు రూట్ మార్చింది. ఈ క్రమంలోనే పోలీసులు ఉన్నతాధికారులు తాజాగా బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah)కు నోటీసులు జారీ చేశారు. ఈరోజే జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌కు రావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కారణంగానే నోటీసులు జారీ చేశామని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.
తన ప్రత్యర్థుల ఫోన్‌లను ట్యాప్ చేసి వారిపై నిఘా ఉంచారని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. లింగయ్య(Chirumarthi Lingaiah).. పోలీసు విచారణకు హాజరైతే ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు వివరించారు. కాగా పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేకపోయానని వివరించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా మరికొంత మంది నేతలకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.