బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్(Rapolu Ananda Bhaskar) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపారు. రాపోలుతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా గులాబీ పార్టీని వీడారు.
ఈ సందర్భంగా రాపోలు(Rapolu Ananda Bhaskar) మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి తన అవసరం లేదని.. అందుకే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కేటీఆర్(KTR) కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది చెబుతాను అని తెలిపారు. కాగా 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న రాపోలు.. 2019లో బీజేపీలో చేరారు. అయితే 2022లో మునుగోడు ఉపఎన్నిక సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు.