మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao)ను ఈరోజు ఉదయం గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఇంటికి వెళ్లిన క్రమంలో హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులో భాగంగా అతనిని అరెస్ట్ చేయడం కోసం గురువారం ఉదయాన్నే పోలీసులు.. ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లనీకుండా కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హరీష్ రావు, జగదీశ్ రెడ్డి.. కౌశిక్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎవరో లోపలికి వెళ్లడానికి వీళ్లేదని పోలీసులు అన్నారు. దీంతో హరీష్ రావు, ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పాడి ఇంటినుండి హరీష్ తదితరులను వెళ్ళిపొమ్మని పోలీసులు ఎంతచెప్పినా వినలేదు. దాంతో వేరేదారిలేక పోలీసులు హరీష్(Harish Rao) ను అరెస్టుచేసి అక్కడినుండి తరలించారు. ఈ క్రమంలోనే హరీష్ రావును గచ్చిబౌళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే బుధవారం తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని పేర్కొంటూ ఫిర్యాదు ఇవ్వడం కోసం బుధవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బయటకు వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి.. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెళ్లాలని డిమాండ్ చేశారు. తాను ఒక అర్జెంట్ పనిపైన వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఆయన ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పారు. దాంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అనుచరులు సీఐ వాహనాన్ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.
దీంతో సీఐ వెనక్కు వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం తనను తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి సహా ఆయన అనుచరులపై సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ సహా 20మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 57, 126(2), 132, 224, 333, 451(3), 191(2), r/w 190, r/w 3(5) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.