తమను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల నుంచి సమ్మె చేపడుతున్న జీహెచ్ఎంసీ(GHMC) ఔట్ సోర్స్ కార్మికులు మంగళవారం తమ ఆందోళనలను మరింత ఉద్దృతం చేశారు. ఉదయం ఎల్బీనగర్, కాప్రా, ఆబిడ్స్ ప్రాంతాలతో పాటు సిటీలోని ఆరు జోన్ల పరిధిలోని పలు ఆఫీసులను కార్మికులు ముట్టడించగా, ఆబిడ్స్ జీహెచ్ఎంసీ ఆఫీసు ఔట్ సోర్స్ ఉద్యోగులు విధులను బహిష్కరించి పెన్ డౌన్ నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్మికులను ఆందోళనలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (జీహెచ్ఎంఈయూ) అధ్యక్షుడు ఊదరి గోపాల్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన న్యాయమైన డిమాండ్ నెరవేర్చుకోవటంతో పాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని సూచించారు. చాలా సర్కిళ్లలో కార్మికులను అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో కార్మికుల నుంచి బయోమెట్రిక్ యంత్రాలను లాక్కుంటామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారని, ఇంకొన్ని చోట్ల జీతం కట్ చేస్తామంటూ అధికారులు చేస్తున్న బెదిరింపు లకు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అటెండెన్స్ వేసుకుని ఆందోళన చేయండి జీహెచ్ఎంసీ(GHMC)లోని ప్రతి ఔట్ సోర్స్ కార్మికుడు, కార్మికురాలు కూడా రోజూ ఉదయం అటెండెన్స్ వేసుకున్న తర్వాత, శానిటేషన్ పనులు రెండు గంటల పాటు నిర్వహించి, ఆ తర్వాత ఆందోళన చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంతో శాంతియుతంగా తాము ఆందోళనలు చేపడుతున్నామని, తమను కార్మికులందర్నీ పర్మినెంట్ చేసే వరకు ఆందోళనలో వెనక్కి తగ్గేదేలేదని ఆయన స్పష్టం చేశారు.