తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అమెరికా పెట్టుబడుల పర్యటనలో జరిపిన మంతనాలు ఫలించాయి. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను (GSEC) ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. ఈ క్రమంలో గూగుల్(Google) ప్రతినిధి బృందం నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. GSEC ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు.
కాగా ఈ ఏడాది ఆగష్టులో సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గూగుల్ సంస్థను హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన గూగుల్(Google) హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
గూగుల్ తో ఒప్పందం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్న తొలి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్ కి రావడం సంతోషంగా ఉందన్నారు. గూగుల్ తన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ని స్థాపించడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇది ఆసియా పసిఫిక్‌లో రెండవది, ప్రపంచంలో ఐదవది కావడం విశేషమని చెప్పారు.
“ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో, మేము చరిత్ర సృష్టించాము. హైదరాబాద్ ను సేఫ్టీ ఇంజనీరింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్ హబ్‌గా మార్చడానికి పునాదిని ఏర్పాటు చేసాము. ఇది రాబోయే కాలంలో మన యువతకు వేలాది ఉద్యోగాలు, అనేక గొప్ప అవకాశాలను సృష్టిస్తుంది” అని సీఎం రేవంత్ వెల్లడించారు.
Read Also: హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు.. ఏ కేసుపైనంటే..