RTC Bill | టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత, పలు అంశాలపై స్పష్టత తీసుకున్న తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో రవాణా శాఖ అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. బిల్లులో తనకు ఎదురైన సందేహాలపై చర్చించారు. అధికారులు ఇచ్చిన వివరణ తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళే సభలో బిల్లును ప్రవేశపెడతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. మరికాసేపట్లో అసెంబ్లీ ఆమోదం కోసం సభ ముందుకు ఆర్టీసీ బిల్లు రానుంది. మరోవైపు అధికారులతో సమావేశం ముగిసిన అనంతరం గవర్నర్ పుదిచ్చేరికి బయలుదేరి వెళ్లారు.
గవర్నర్ అధికారులను అడిగిన ప్రశ్నలు ఇవే…
1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లు(RTC Bill)లో ఎలాంటి వివరాలు లేవు.
విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని చెప్పలేదు.
విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా పెన్షన్ ఇస్తారా? అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు లేవు.
ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొత్తానికి ఆమె ఆడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారు.