టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్ జనార్థన్ రెడ్డి, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) ఆమోదించారు. గత చైర్మన్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీ అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీంతో సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలోనే కొత్త బోర్టు ఏర్పాటు కానుంది. ఈ బోర్డు ఏర్పాటుకాగానే పోటీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పేపర్లు లీక్ కావడం సంచలనంగా మారింది. దీంతో ఆ పరీక్షలను క్యాన్సిల్ అయ్యాయి. దీని వల్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. యువత భవిష్యత్‌తో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తాము అధికారంలోకి రాగానే బోర్డు(TSPSC)ను ప్రక్షాళన చేసి సమర్థవంతంగా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్లే అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్డు సభ్యుల రాజీనామాకు అంగీకారం తెలిపింది. దీంతో రాజకీయ ప్రమేయం లేకుండా కొత్త బోర్డు సభ్యులను నియమించనుంది. ఈ నియామకాలు పూర్తి కాగానే పోటీ పరీక్షలను నిర్వహించనుంది.