గత వారం వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు వారీ ఖర్చులకి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత పదేళ్లలో జరిగిన తప్పిదాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలని అందుకే శ్వేతపత్రం విడుదల చేశామని భట్టి తెలిపారు.
శ్వేతపత్రం(White Paper) ఆధారంగా “రాష్ట్రంలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉన్నాయి. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు ఉంది. 2014-15 నుంచి 2022 – 23 మధ్య కాలంలో సగటున 24.5శాతం అప్పు పెరిగింది. 2023–24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు. 2015–16లో రుణ, జీఎస్డీపీ15.7శాతంతో దేశంలోనే అత్యల్పం. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 రెట్లు రుణభారం పెరిగింది” అని భట్టి వివరించారు.
Telangana Assembly | ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడుతూ 42 పేజీల నోట్ ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదు… దీన్ని చదవకుండా ఏం మాట్లాడాలి అధ్యక్షా? అని ప్రశ్నించారు. నోట్ ను చదవడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi), సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు కూడా శ్వేతపత్రంపై ఆధ్యాయనం చేసేందుకు కనీసం గంట సమయం కావాలని కోరడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అరగంట పాటు టీ బ్రేక్ ఇచ్చారు.