శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నింటినీ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని గుర్తించకుండా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితవుపలికారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పరిపాటిగా మారిందని.. కేసీఆర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ లీడర్లు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని.. 50 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు బలిదానాలు చేసుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ను కూడా ప్రజలు నమ్మరని అన్నారు. కేంద్రం ఒక్క మంచి పని కూడా చేయలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) విమర్శించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ(BJP)కి లేదని స్పష్టం చేశారు.