తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైందని తప్పుడు కేసు అని, రాజకీయ ప్రతీకారం కోసమే కాంగ్రెస్ తనను టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే నిరాధారంగా తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఆయన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కాగా తనపై నమోదైన కేసు.. బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్‌లో ఉన్న భయానికి ప్రతీక అని ఇప్పటికే విమర్శలు చేశారు. అడుగడుగునా కాంగ్రెస్ వైఫ్యలాలను ఎత్తి చూపుతున్నామని, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్ పక్కా ప్లాన్ ప్రకారం తమ నేతతో తనపై కేసు పెట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట(Punjagutta) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశానికి సంబంధించి బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
అతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఐపీసీ 120బీ, 386, 409 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు తన ఫోన్ సహా తన కుటుంబీకులకు చెందిన 20 ఫోన్‌లను హరీష్ రావు(Harish Rao) ట్యాప్ చేయించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.