సచివాలయం భవనంలో కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) తప్పుబట్టారు. కేవలం వాస్తు పిచ్చితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పక్కాగా ఈ భవనాన్ని నిర్మించిందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నారని, వాస్తు దోషం ఉందని చెప్తూ ఒక్క గేట్ మార్పు కోసం రూ.4కోట్లు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. మార్పు చేయాల్సింది సచివాలయంలో కాదని, పాలన చేస్తున్న వ్యక్తుల్లో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.
‘‘సచివాలయ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ భవన నిర్మాణం కోసం గ్రీన్ టెక్నాలజీని వినియోగించాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలను కూడా పక్కాగా పాటించి నిర్మించడం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం వాస్తు దోషాలను వెతుకున్నారు. ఆ పిచ్చితోనే ఇప్పుడు పూటకో మార్పు, రోజుకో మాట మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు Harish Rao.