అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఏమో కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణను అప్పుల(Telangana Debt) పుట్టగా మార్చడం ఖాయమంటూ విసుర్లు విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేశారంటూ సూక్తులు చెప్తున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలో ఎంత అప్పు చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు పట్టిన ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లు అప్పులు చేసిందని దుయ్యబట్టారు హరీష్ రావు. కానీ అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇలానే కొనసాగితే వాళ్ల ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి రాష్ట్ర అప్పు రూ.6.36 లక్షల కోట్లకు పెరగుతుంది. బీఆర్ఎస్(BRS) హయాంలో చేసిన అప్పులపై ప్రస్తుతం ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,496 కోట్ల అప్పులు చేస్తే.. అది రూ.7 లక్షల కోట్లు అప్పులు తెచ్చినట్లు ఈ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. అప్పులు అంశంపై సభలో ప్రత్యేక చర్చ చేపట్టాలి. ఎన్నికల ముందు వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం తమకు సమస్యే కాదని చెప్పిన భట్టి ఇప్పుడు అప్పులను సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నారు’’ అని Harish Rao అన్నారు.