కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఎన్నికల సమయంలో బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా కల్పించలేకుందని చురకలంటించారు. పత్తి రైతులు ప్రతి క్వింటాకు రూ.1500 వరకు నష్టపోతున్నారని వివరించారు. మాట్లాడితే ప్రతిపక్షాలే టార్గెట్‌గా కేసులు బనాయించడం, ఇబ్బందులకు పెట్టడం కాకుండా ప్రజా సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్షాలపై కుట్ర చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. వరి, పత్తి దళారుల పాలవుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, రుణమాఫీ చేయకుండా, రైతుబంధు నిలిపేసి రైతులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.
‘‘కేసీఆర్(KCR) పాలనలో రైతులు కష్టం అంటే తెలియకుండా ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో పత్తికి గరిష్ఠంగా రూ.11వేలు, కనిష్ఠంగా రూ.9వేల ధర వచ్చింది. అలాంటిది పత్తి ధర ఇప్పుడు ఎందుకు తగ్గింది? పత్తి రైతులకు ధర రావాలి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు రూ.500 బోనస్ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాటలకు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాటలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలి ఆధిపత్యం కోసం చేస్తున్న పోరులో బిజీ అయిపోయారు’’ అని దుయ్యబట్టారు హరీష్ రావు(Harish Rao).