Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా అధికారులు దాదాపు 73 ప్రశ్నలు అడగనున్నారు. ఈ నేపథ్యంలో తమ గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ప్రజల వెనకడుగు వేశారు. అధికారులు అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలా వద్దా అన్న సంశయంలో కూడా పడ్డారు ప్రజలు. అయితే ఎవరికీ ఆందోళన, భయం అక్కర్లేదని, ప్రజలు అందించే సమాచారం అంతా కూడా అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) భరోసా ఇచ్చారు.
అటువంటిది ఈరోజు పలు కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్డుపై కనిపించడం తీవ్ర చర్చలకు దారి తీసింది. అసలేటిందని ప్రజలు విస్తుబోతున్నారు. ఆ దరఖాస్తులు అన్నీ కూడా వివరాలతో నిండి ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమాచారానికి ఈ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం అంటే ఇలా రోడ్డుపై పడేయటమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నమ్మించి సమాచారం సేకరించింది ఇలా రోడ్డు పాలు చేయడానికా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాడు అభయహస్తం దరఖాస్తులు, ఈరోజు కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్డెక్కాయంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల నుంచి అధికారులు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం గోప్యత, భద్రతపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందని విమర్శలు గుప్పించారు.
‘‘నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు(Caste Census). ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం. రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది.
సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు(Harish Rao) తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.