కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిజమైన సాయం చేయడం కంటే ప్రయోజనాలను తగ్గించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు పెద్దఎత్తున వాగ్దానాలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటిని తుంగలో తొక్కి ప్రజలకు ద్రోహం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు.
మొదటి హామీ అయిన మహాలక్ష్మి అమలు కాలేదని, చివరి హామీ అయిన చేయూతలో ఎలాంటి పురోగతి లేదని ఆయన చురకలంటించారు. మిగిలిన ఆరు హామీలు కూడా అదే స్థితిలో ఉన్నాయి, అన్ని చోట్లా కోతలు, పరిమితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ ప్రకటనలను ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగిస్తోందని, ఇది అవమానకరమని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ప్రయోజనాలను కోల్పోతున్నారని, దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పేదలకు శాపంగా ఉన్నాయని, అధికారులపై భారం మోపుతున్నాయని హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. ప్రజాపాలన కార్యక్రమంలో మీసేవ ద్వారా వచ్చిన లక్షలాది దరఖాస్తులను పట్టించుకోకుండా కుల గణన ఆధారంగా రేషన్ కార్డుల(Ration Cards) ఎంపిక ప్రక్రియ చేపట్టి గ్రామాలకు ముందుగా నిర్ణయించిన జాబితాను పంపారని విమర్శించారు. తమ 10 ఏళ్ల పాలనలో 6,47,479 రేషన్‌కార్డులు ఇచ్చామని, అదనంగా 20,69,033 మంది లబ్ధిదారులకు రేషన్ సపోర్టు అందించామని చెప్పుకొచ్చారు. కేసీఆర్(KCR) సీఎంగా ఉన్నప్పుడు పేదలకు రేషన్ కార్డులు అందేలా ఆదాయ పరిమితిని పెంచారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా కోత విధించడం, లబ్ధిదారులను మినహాయించడంపైనే దృష్టి సారించింది అని హరీష్ విమర్శించారు.
“గత దశాబ్దంలో ద్రవ్యోల్బణం వార్షికంగా సగటున 5.42% నమోదైంది, ఇది ధరలలో 69.6% పెరుగుదలకు దారితీసింది. అర్హులైన పేద కుటుంబాలందరికీ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.55 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3.4 లక్షలుగా సవరించాలి” అని హరీష్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసి.. ఇప్పుడు కోటి మంది నుండి కేవలం 6 లక్షలకు అర్హతను భారీగా తగ్గించే షరతులు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారని, వారు లబ్ధి పొందేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు.